వేసవి సెలవులు అయినందున స్విమ్మింగ్పై ఆసక్తి చూపుతున్న చిన్నారులు Children are interested in swimming in Karimnagar : ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నారుల నుంచి పెద్దవారు ఈత కొలనుల బాట పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, వ్యాయామం చేయడానికి ఈత కొట్టడం ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెప్పడంతో స్విమ్మింగ్కి సమయం కేటాయిస్తున్నారు. అయితే.. స్విమ్మింగ్ చేయడం బరువు తగ్గడంతో పాటు మంచి శరీరాకృతికి సహాయపడుతుంది. ఒక గంట పాటు ఈత కొడితే.. అది ఒక గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
నిపుణుల పర్యవేక్షణలో చిన్నపిల్లలకు స్విమ్మింగ్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని ఈత కొలను చిన్నారులతో కిటకిటలాడుతుంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు నిపుణుల సహాయంతో చిన్నారులకు ఈతను నేర్పిస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నలుగురు కోచ్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. ఈత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
స్మిమ్మింగ్ చేస్తే వచ్చే ప్రయోజనాలు :
- స్విమ్మింగ్ అనేది శరీరానికి విశ్రాంతిని ఇచ్చే వ్యాయామం.
- ఈత కొట్టడం వల్ల పాదాలు నిరంతరం కదులుతాయి. ఇది చేతులు, భుజాలకు బలాన్ని చేకూర్చి.. కండరాలకు శక్తిని పెంచుతుంది.
- శరీరాన్ని బయట వైపు మాత్రమే కాకుండా లోపల నుంచి ఆరోగ్యవంతంగా మార్చే వ్యాయామ ప్రక్రియ.
- గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
- రక్తపోటు తగ్గుతుంది, మధుమేహం అదుపులో ఉంటుంది.
- కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
- వేసవిలో స్విమ్మింగ్ పూల్లోని నీరు గోరువెచ్చగా ఉండడం వల్ల శరీర నొప్పులు దూరమవుతాయి.
- ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. శ్వాస సామర్థ్యం పెరుగుతుంది.
- ఆస్తమా రోగులకు శ్వాస వ్యవస్థ మెరుగు పడుతుంది.
- ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.
- ఒక గంట పాటు ఈత కొడితే.. అది గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
- కీళ్లపై ఎటువంటి దుష్ప్రభావం చూపించదు.
గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, బావుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు చిన్ననాటి నుంచే ఈత నేర్పిస్తే తమ ప్రాణాలను కాపాడుకోవడం కాకుండా.. ఇతరుల ప్రాణాలను సైతం కాపాడిన వాళ్లు అవుతారు.
ఇవీ చదవండి: