తెలంగాణ

telangana

ETV Bharat / state

Check Dams: చెక్​డ్యాంలు ముక్కలు ముక్కలు.. ప్రజాధనం 'వరద'పాలు

భూగర్భజలాలను పెంచుకోవాలన్న ఉద్దేశంతో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు నాణ్యత కొరవడి వర్షపు నీటికి నామరూపాల్లేకుండా కొట్టుకుపోతున్నాయి. పలు చోట్ల వ్యవసాయ అవసరాలకు, మరికొన్ని ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. అయితే అధికార యంత్రాంగం కనీస నిబంధనలు, నాణ్యతను పాటించడం లేదన్న విమర్శలు వెలువెత్తాయి. ఈ విమర్శలకు బలం చేకూరే విధంగా ఇటీవలి వర్షాలకు పలుచోట్ల చెక్‌డ్యాంలు కొట్టుకు పోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

check dams
చెక్​ డ్యాంలు

By

Published : Sep 19, 2021, 2:14 PM IST

ఉపనదులు, వాగుల ప్రవాహాలను ఆపి, నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2,874 కోట్లతో 639 చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో టెండర్లను ఆహ్వానించగా ప్రస్తుతం 596 చెక్‌డ్యాంల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మరో వైపు కరీంనగర్‌లో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా ప్రత్యేకంగా ఐదు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దిగువ మానేరు ప్రాజెక్టు కింది భాగంలో మానేరు నదిలో రూ.87.90కోట్ల వ్యయంతో ఐదు చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ప్రాజెక్టు కింది భాగంలో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నప్పుడు గేట్లు ఎత్తితే నీటి ప్రవాహ ఒత్తిడి ఏ మేరకు ఉంటుంది.. ఏమేరకు నీళ్లు ఉంటాయో అంచనా వేసి చెక్‌డ్యాం​లు నిర్మించాల్సి ఉంటుంది.

నాణ్యతాలోపంతో ముక్కలవుతున్న చెక్‌డ్యాంలు

కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో మొదటి విడతగా 638 చెక్‌డ్యాంలను మంజూరు చేసింది. 593 నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పూర్తయినవి, పనులు దాదాపు పూర్తికావచ్చిన డ్యాంలలో కొన్ని వరదలకు కొట్టుకుపోతున్నాయి.

అంచనా లేకుండానే

ఒక్కో చెక్‌డ్యాంకు దాదాపు రూ. 8కోట్ల చొప్పున కేటాయించి బొమ్మకల్‌, గోపాల్‌పూర్‌, మొగ్దూంపూర్‌, ఇరుకుల్ల, మందులపల్లి వద్ద నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు కురిసినప్పుడు లోయర్ మానేరు డ్యామ్​ నుంచి గతంలో ఎన్ని నీళ్లు కిందికి వదిలి పెట్టారు. దాని ప్రవాహం ఒత్తిడి ఏమేరకు ఉంటుందో అంచనా వేసి దానికి దీటుగా చెక్‌డ్యాం నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఇదేమి పట్టించుకోకుండా ఒక లక్షా 70వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే విధంగా నిర్మాణం చేపట్టడం అసలు సమస్యగా మారింది. నెల కింద కురిసిన వర్షానికి దాదాపు 2లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో బొమ్మకల్ వద్ద చెక్‌డ్యాం​ ముక్కలు కాగా తాజాగా కురిసిన వర్షంతో మరో 4 చెక్‌డ్యాంలు కొట్టుకుపోయాయి. చెక్‌డ్యాం​ల నిర్మాణంలో నాణ్యత లోపించినందు వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రివర్​ ఫ్రంట్​లో భాగంగా నిర్మించిన చెక్​ డ్యాం పనుల్లో భాగంగా కాంట్రాక్టర్​కు​ రూ. 6 కోట్ల పైనే ఇచ్చారు. ఇప్పుడు చిన్నపాటి వర్షాలకే డ్యాం కొట్టుకుపోయింది. నాణ్యతా లోపమే ఇందుకు కారణం. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఈ సారైనా ప్రభుత్వం నాణ్యతపై దృష్టి సారించాలి. -కోమటిరెడ్డి నరేందర్​ రెడ్డి, కాంగ్రెస్ నేత

డిజైన్​ లోపం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరు వాగుపై చెక్‌డ్యాం నాసిరకంగా నిర్మించడంతో రెండు ముక్కలైంది. రూ.14.46 కోట్లకు టెండరు నిర్వహించగా ‘లెస్‌’ టెండర్‌తో రూ.10.93 కోట్లకే గుత్తేదారు దక్కించుకున్నారు. ప్రవాహానికి అనుగుణంగా ఆకృతి (డిజైన్‌) లేకపోవడం ప్రధాన లోపం. ఇటీవల తొలిసారి వచ్చిన వరదలకు డ్యాం మధ్యభాగం రెండుగా విడిపోగా.. రెండోసారి వచ్చిన వరదకు రెండు వైపులా గోడల పక్కన మట్టి భారీగా కోతకు గురైంది. ఒకవైపు గోడ మధ్యలో నెర్రెలిచ్చింది.

మానేరు వాగుపైన డ్యాం 12గేట్లు ఎత్తితేనే చెక్​ డ్యాం కూలిపోయిందంటే.. ఇక 25 గేట్లు ఎత్తితే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. సుమారు రూ. 400 కోట్లు వృథా అయింది. చిన్నపాటి వర్షాలకే చెక్​ డ్యాంలు కూలిపోతున్నాయంటే నాసిరకం పనుల వల్లే అని తెలుస్తోంది. పర్యవేక్షణా లోపం కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వం చొరవ తీసుకుని అవినీతికి పాల్పడుతున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి. -స్థానికులు

కొరవడిన పర్యవేక్షణ

దిగువ మానేరు జలాశయ దిగువ భాగాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్న అధికారులు.. ఎంతో ముందు చూపుతో వ్యవహరించి చెక్​డ్యాంలు నిర్మించాల్సి ఉండగా పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఒక్క వర్షానికే ఈ స్థాయిలో చెక్‌డ్యాం​లు కొట్టుకుపోతే పర్యాటకులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చెక్‌ డ్యాం నిర్మాణం సందర్భంగా వినియోగించాల్సిన ఉక్కు, సిమెంట్‌ ఆ మేరకు వాడకపోవడం వల్లనే ఈ అనర్థాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కమీషన్​లకు కక్కుర్తి పడినందువల్లనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెక్‌డ్యాంల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కార్‌.. నిర్మాణాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:Check Dam: అన్నింటికీ ఒకే డిజైన్‌... అదే పెద్ద లోపం..!

ABOUT THE AUTHOR

...view details