హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని (Trs Complaints On Etela) కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస (Trs) నాలుగు ఫిర్యాదులు సమర్పించింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మరణించగా.. ఆ ఘటనతో ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను తప్పుడు కేసులో ఇరికించేందుకు భాజపా, ఈటల రాజేందర్ ప్రయత్నించారని తెరాస ఆరోపించింది.
తెరాస విద్యార్థి విభాగం నాయకుడు జగన్‌పై భాజపా నాయకులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ రోడ్ షో (Etela Rajender Road show) నిర్వహించారని మరో ఫిర్యాదులో అధికార పార్టీ ఆరోపించింది. దసరా సందర్భంగా ఓటర్లకు తెరాస వేల రూపాయలు, మాంసం పంచుతోందని వాటిని తీసుకొని ఓటు మాత్రం తనకే వేయాలని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించి భాజపా, ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో పాటు పలు వీడియోలను సమర్పించారు.
రసవత్తరంగా ప్రచారం...
హుజూరాబాద్ ఉపఎన్నికల (huzurabad by election) ప్రచారం రసవత్తంగా సాగుతోంది. ఈఎన్నిక.. మంత్రి హరీశ్‌రావు, భాజపా అభ్యర్థి ఈటల మధ్య అన్నట్లు సాగుతోంది. దీనికి ప్రధాన పార్టీలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ... ప్రత్యర్థిని ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈటల మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.