హన్మకొండ జిల్లా సూర్యానాయక్ తండాకు చెందిన విశ్రాంత ఎస్సై పాపయ్యనాయక్... రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్‌లో స్థిరపడ్డారు. గురువారం రాజీవ్ రహదారిపై ముల్కనూర్ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పింది. రోడ్డు కుడివైపునకు వ్యతిరేక దిశలో దూసుకెళ్లింది. అక్కడ లోతైన బావి ఉంది. దాని పక్కన చిన్నపాటి కల్వర్టు రక్షణగా ఉన్నప్పటికీ వేగం వల్ల కారు అదుపులోకి రాక అడ్డుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని మరీ బావిలో పడిపోయింది. పాపయ్యనాయక్ కారు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో కారుతో పాటే ఆయన జలసమాధి అయ్యారు.
శ్రమించి...
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కారును వెలికితీసేందుకు అగ్నిమాపక శాఖ సహాయాన్ని కోరారు. మానకొండూర్ అగ్నిమాపక శాఖ అధికారిగా భూదయ్య నాయక్.. వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. 60 అడుగుల లోతున్న ఆ బావిలో నీళ్లు నిండుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. క్రేన్ సాయంతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఎట్టకేలకు ఉదయం 11 గంటల సమయంలో పడిన కారును రాత్రి 8 గంటల తరువాత వెలికితీశారు.