Gangula Counter On Botsa Satyanarayana Comments : తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక జగన్ ప్రభుత్వం లేకపోతే.. ఆయనను బర్తరఫ్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయితో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కనీసం వీరిలో ఒక్కరినైనా పట్టుకున్నారా ఏపీ మంత్రి బొత్స సమాధానం చెప్పాలన్నారు. టీఎస్పీఎస్సీలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే అని గంగుల గుర్తు చేశారు. ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులే వసూళ్లు చేసి ఉద్యోగాలిస్తున్నారని తెలిపారు. వీటిన్నింటిపై మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రంలోపు స్పందించాలని హెచ్చరించారు.
బొత్స సత్యనారాయణను బర్తరఫ్ చేయాలి : విద్యావ్యవస్థపై స్పందించిన తర్వాతనే.. బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని సూచించారు. ఆయన మాటల వెనుక జగన్ ప్రభుత్వం లేకపోతే తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బొత్సను వెంటనే వైసీపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసి చూపించాలన్నారు. ఇప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స.. గతంలో కాంగ్రెస్‌లో కూడా మంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి.. నేడు తెలంగాణ సిద్ధించాక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారు. ఇంకా మన విద్యావ్యవస్థ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో అత్యుత్తమ విద్యను అందించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై వ్యాఖ్యలు చేశారు. అందులో తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వమే దొంగలను పట్టుకుంది. ఏపీ పాలకులు ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు రూ.5 లక్షలు ఇస్తే చేస్తారు. తెలంగాణలో అంతా చిత్తశుద్ధి ఉంటుంది. వెంటనే జగన్ మంత్రి బొత్సను బర్తరఫ్ చేయాలి."- గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
Botsa Comments On Telangana Education System : వాస్తవానికి తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగుపడిందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. గతంలో 297 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. ఆంధ్రా నాయకుల వైఫల్యాల వల్ల ఎంతో మంది తెలంగాణ బిడ్డలు చదవలేకపోయారని ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఆ గురుకులాల్లో సుమారు పది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఇప్పుడు కూడా ఏపీలో 380 గురుకులాలు మాత్రమే ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.
అసలేం జరిగింది : ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేస్తున్న సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యావ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యావిధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తూనే ఉన్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణలో ఉందన్నారు. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి బొత్స అన్నారు.
బొత్స కామెంట్స్ వెనుక జగన్ లేకపోతే.. వెంటనే బర్తరఫ్ చేయాలి ఇవీ చదవండి :