వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై కుంగిన వంతెన
వారం రోజులుగా కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి-563పై ఓ కల్వర్టు కుంగిపోయింది. రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న వంతెన కుంగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి… వంతెనకు ఓ వైపు బుంగ పడటాన్ని గుర్తించిన అధికారులు... తాత్కాలిక మరమ్మత్తులు చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
వంతెన కుంగిపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారుల విభాగం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. కుంగిపోయిన వంతెనను పరిశీలించారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి… రెండు జేసీబీ యంత్రాలను రంగంలోకి దింపారు. వంతెన వద్ద మరమ్మతు పనులను ప్రారంభించారు. కరీంనగర్, వరంగల్‌కు వెళ్లే వాహనాలను వేరే దారుల గుండా మళ్లిస్తున్నారు.