Bandi Sanjay Comments: పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో..? లేదో..? అనుమానంగానే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యారోపణలు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో సర్కారు ఉందని బండి సంజయ్ ఆరోపించారు. రేపు కరీంనగర్లో నిర్వహించబోయే హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. రెండేళ్ల తర్వాత యాత్ర నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెరాస నాయకులు జైహనుమాన్ అంటున్నారంటే అది కేవలం భాజపా వల్లే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న ఆలోచనే లేదని.. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద సెప్టెంబర్ వరకు కేంద్రం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే.. ఇక్కడ కిలోకు ఒక్క రూపాయి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించడం లేదని చెప్పుకోవడమే తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని బండి సంజయ్ ఆరోపించారు.