ఉద్రిక్త పరిస్థితుల మధ్య భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరాహార దీక్ష విరమించారు. 24 గంటలుగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంతో నిరాహార దీక్ష చేసిన సంజయ్‌కి షుగర్ లెవెల్స్ పడిపోవడంతోపాటు రక్తపోటు విపరీతంగా పెరిగి.. అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించడం వల్ల పరిస్థితి కొంతమేర కుదుటపడింది.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష విరమణ
20:44 October 27
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష విరమణ
మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డిలు బండి సంజయ్‌కు నచ్చజెప్పి స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంజయ్‌ని తరలించే సమయంలో కొందరు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పార్టీ నాయకులు వారికి సర్దిచెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు, తెరాస నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. బండి సంజయ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం వివేక్‌తో పాటు జితేందర్ రెడ్డిలు నిమ్మరసం ఇచ్చి సంజయ్ దీక్షను విరమింపజేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ను సస్పెండ్ చేసే వరకు పోరాడటమే కాకుండా ఉప ఎన్నికల్లో గెలిచి తీరతామని వారు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్