తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajendar: "నూతన సచివాలయం నుంచైనా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను" - కరీంనగర్ జిల్లా న్యూస్

Etela Rajender criticized KCR: సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయనపై విమర్శలు చేశారు. ఏ రోజు కార్యాలయానికి రాని కేసీఆర్‌ నూతన సచివాలయానికైనా వస్తారని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. గత తొమ్మిది సంవత్సరాల్లో అధికారులను కలవలేదని.. ఇకనుంచైనా పాలన వేగవంతం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 30, 2023, 5:47 PM IST

Etela Rajender criticized KCR: ఏ రోజూ కార్యాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయానికైనా వస్తారని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పర్యటించారు. హుజూరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ఆయన వెళ్లి.. సంఘీభావం తెలిపారు.

Etela Rajender Comments on KCR: అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సచివాలయంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల సందర్శన ఉండేది, ఇప్పుడు అది లేదని ఎద్దేవా చేశారు. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను, అధికారులను కలవలేదని విమర్శించారు. సచివాలయంలో ఏ మంత్రి శాఖ ఎక్కడ ఉందో అనే విషయం తెలిసే పరిస్థితి లేదన్నారు.

నాయకుల ఆనవాలు ఉండకూడదనే పాత సచివాలయం కూల్చారు:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సరిపోయే విధంగా నాడు గొప్ప సచివాలయం ఉండేదని ఈటల అన్నారు. 8 కోట్ల మంది ప్రజలకు అక్కడి నుంచే ముఖ్యమంత్రులు సేవలు అందించారని గుర్తు చేశారు. ఆ నాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే ఆలోచనతోనే పాత సచివాలయాన్ని నామరూపం లేకుండా కూల్చేశారని ధ్వజమెత్తారు. చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే భావనతో ముఖ్యమంత్రి కొత్త సచివాలయాన్ని నిర్మించారని దుయ్యబట్టారు. కొత్తగా కట్టిన సచివాలయాన్ని వ్యతిరేకించటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన సచివాలయం నుంచైనా ప్రజలకు సేవలను అందించాలని కోరారు.

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 8 కోట్ల ప్రజలకు పాలన చేసే విధంగా పాత సచివాలయం ఉండేది. దాన్ని కూల్చేశారు. ఎందుకంటే ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కేసీఆర్‌ భావిస్తున్నారు. తానే చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటున్నారు. నూతన సచివాలయాన్ని నిర్మించినందుకు నేను వ్యతిరేకించట్లేదు కాని ఆయన ప్రతిష్ఠత కోసం పాత సచివాలయాన్ని కూల్చడం అన్యాయం. ఎన్నడూ కార్యాలయానికి రాని ముఖ్యమంత్రి నూతన సచివాలయానికి వస్తారని కోరుతున్నాను. పాత సచివాలయంలో ప్రజా సందర్శన కోసం సాయంత్రం 3 నుంచి 5 వరకు వీలు ఉండేది. ప్రస్తుతం అది పూర్తిగా రద్దు చేశారు. తొమ్మిది సంవత్సరాలుగా ఏ ఒక్క మంత్రిని, అధికారిని కలవలేదు. ఏ మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉందే తెలియదు. అందుకే నూతన సచివాలయం నుంచైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాను."- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

"నూతన సచివాలయం నుంచైనా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను"

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details