ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన పోటీలో.. చివరికి ఆత్మగౌరవమే గెలిచిందని హుజూరాబాద్ ఉపఎన్నిక విజేత ఈటల రాజేందర్ తెలిపారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప మెజార్టీతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించి.. ఆత్మగౌరవ బావుటా ఎగరేసిందుకు శిరసావహించి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ఇన్ని రోజులు ఎలాగైతే పాటుపడ్డానో.. ఇక ముందు కూడా అదే తీరుగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
గొప్ప తీర్పునిచ్చారు..
"హుజూరాబాద్ ఉపఎన్నికలో గొప్ప మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని ఈసీ చెప్పింది. కానీ.. అధికారులు మాత్రం ప్రజాస్వామ్య విలువలను ఎక్కడా పాటించలేదు. స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి.. నోరు విప్పని దుస్థితి తెచ్చారు. పోలీసులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారు. అక్రమాలు జరుగుతున్నా స్వేచ్ఛగా చూపించలేని పరిస్థితి ఉంది. ఉపఎన్నికలో కుల ఆయుధం ప్రయోగించారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. దేనికి లొంగకుండా.. గొప్ప తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడారు. ఎన్నో కష్టాలకు ఓర్చుకుని పనిచేసిన కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు." - ఈటల రాజేందర్, హూజారాబాద్ ఎమ్మెల్యే