biker attack on rtc bus: చేతిలో బైక్ ఉంటే చాలు.. రయ్రయ్ మంటూ రోడ్డపై యువత చక్కర్లు కొట్టేస్తున్నారు. వాళ్లు వేళ్లే వేగానికి ఇతర వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి. కొందరు యువకులు రోడ్ల మీద బైకులతో చేసే సాహసకృత్యాలు, విన్యాసాలు కొన్ని సార్లు వికటించి.. వాళ్లతో పాటు ఇతర వాహనదారులు సైతం ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే.. ఒకవేళ తన బైక్‌ను దాటేసి వేరే వాహనాలు ముందుకెళ్తే మాత్రం వాళ్లు చేసే రచ్చ మరో ఎత్తు. వేగం పెంచి దూసుకెళ్లటమో.. లేక ఛేజ్ చేసి మరీ దమ్కీలు ఇవ్వటమో.. చేస్తుంటారు.
biker fire on rtc bus driver: కరీంనగర్ జిల్లా గంగాధరలో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. తన బైక్‌ను దాటేసి వెళ్లినందుకు ఓ ఆర్టీసీ బస్సుపై ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తోంది. గంగాధర సమీపంలో బస్సు యాదృశ్ఛికంగానే ఓ ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్లిపోయింది. అంతే.. ద్విచక్రవాహనదారునికి కోపం వచ్చింది. నా బైక్‌ను దాటేసి బస్సు ఎలా వెళ్తుంది..? అని భావించాడో.. అంత వేగం ఆర్టీసీ బస్సుకు ఎందుకు..? అనుకున్నాడో.. ఓవర్టేక్ చేసే క్రమంలో తనకు జరగరానిదేమైనా జరిగితే ఎలా..? అని తలచాడో.. మొత్తానికి ఆగ్రహంతో ఊగిపోయాడు.
అదే కోపంలో.. బైక్ వేగం పెంచాడు. ఈసారి ముందు వెళ్తున్న బస్సును తాను ఓవర్‌టెక్ చేశాడు. రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టి.. బస్సును ఆపేలా చేశాడు. బైకును గమనించిన డ్రైవర్.. ఎందుకు రోడ్డుకు అడ్డంగా పెట్టావని అడగటమే తరువాయి.. తిట్ల దండకం అందుకున్నాడు. తన బైకును ఎలా ఓవర్టేక్ చేస్తావంటూ.. గొడవకు దిగాడు. అంత వేగం అవసరమా అంటూ రంకెలేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్.. ఎంత చెప్పినా వినకుండా రచ్చ చేశాడు. ప్రయాణికులకు ఆలస్యం అవుతుండటంతో ఇక చేసేదేమీ లేక.. అందరూ కలిసి ఆ యువకునికి ఏదో విధంగా సర్దిచెప్పారు. బస్సును వెళ్లనివ్వాలని కోరారు. ఒప్పుకున్న యువకుడు.. బండి పక్కకు తీశాడు.