హుజూరాబాద్ ఉపఎన్నిక.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మధ్య అన్నట్లుగా సాగినా.. క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు భుజానికెత్తుకున్నారు. ఈ పోరు తెరాస-భాజపా మధ్య కాదనే తరహాలోనే ప్రచారమూ సాగింది. తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపిన గులాబీ పార్టీ.. దుబ్బాక తరహా చేదు ఫలితం రాకుండా జాగ్రత్తపడేలా వ్యవహరించారు. నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు మంత్రి హరీశ్‌రావు(Etela Rajender Harish rao News) ప్రయత్నించారు. అన్ని గ్రామాలు కలియతిరుగుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏకరవు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈటల రాజేందర్‌పై(Etela Rajender Harish rao News) మంత్రి ఎక్కుపెట్టిన విమర్శలు కొంత ఎదురుదెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. హరీశ్ లేవనెత్తిన అంశాలకు ఈటల రాజేందర్ దీటుగా బదులివ్వడంలో సఫలమయ్యారు.
విమర్శల జల్లు
నియోజకవర్గ అభివృద్ధి, కుట్ర రాజకీయాలు ఈ ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావించారు. మంత్రిగా ఉన్నా కూడా ఏడేళ్లుగా ఈటల హుజూరాబాద్‌కు చేసింది ఏమీ లేదని హరీశ్‌రావు విమర్శలు ఎక్కుపెట్టారు. కనీసం ఒక్క రెండు పడక గదుల ఇంటిని నిర్మించి ఇవ్వలేదని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో మంత్రులందరూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయించి లబ్దిదారులకు ఇచ్చామని.. ఈటలకు మాత్రం స్వప్రయోజనాలు, వ్యాపారమే ముఖ్యమని విమర్శించారు. రెండు ఎకరాలున్న గెల్లు శ్రీనివాస్‌కు భూస్వామికి మధ్య పోరాటంగా అభివర్ణించారు. ఈ ఆరోపణలను ఈటల తిప్పికొట్టారు. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. డబుల్ బెడ్ రూమ్‌లు కట్టలేదనేది అవాస్తవమని గట్టిగా వాదించారు.