BEAR WANDERING: కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎలుగుబంటి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. దాదాపు 200ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంగణంలో పూలకుండీలు చిందరవందర చేయడంతో భల్లూకం మళ్లీ వచ్చిందనే అభిప్రాయానికి వచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకొంటూనే దాన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన వెంటనే విశ్వవిద్యాలయానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. ఎలుగుబంటి జాడ కోసం జల్లెడ పడుతున్నారు.
ఇక్కడ చిట్టడవిలో ఉన్న రెండు కుంటల వద్దకు ఎలుగు బంట్లు నీటి కోసం వస్తుంటాయని అంచనా వేశారు. దీంతో ప్రాంగణంలో ఎలుగు ఏయే ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశారు. మూడు నెలలుగా వర్సిటీ ప్రాంతంలోనే సంచరిస్తున్న దృష్ట్యా.. ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి అపాయం తలపెట్టలేదని.. అయినా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులను కోరినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.