మానేరు రివర్ (Maneru River) ఫ్రంట్ అభివృద్ధి పనుల డిజైన్లు, టెండర్ ప్రక్రియను డిసెంబర్ నెలాఖర్లోగా పూర్తి చేసి పనులను ప్రారంభించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డీపీఆర్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై నీటిపారుదల, పర్యాటక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు.
పర్యాటక కేంద్రంగా...
ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశాల మేరకు దేశానికే ఆదర్శంగా, తెలంగాణ ప్రజలకు అత్యద్భుత పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మానేరు తీరాన్ని తీర్చిదిద్దేలా పనులు సాగాలని గంగుల స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అంతర్భాగంగా తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తైందన్న ఆయన... రివర్ బెడ్ నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ ఫౌంటైన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు.
తొలి విడతగా...
మొత్తం పదిహేను కిలోమీటర్లకు గాను తొలి విడతగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనున్నారు. ముంపు తగ్గించేలా రివర్ ఫ్రంట్ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యేలా హాప్ బ్యారేజ్, హాప్ వీర్ ప్రాతిపదికన మెదటి విడత నిర్మాణాల నివేదికలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. గత వందేళ్ల నీటి విడుదల పరిమాణం ఆదారంగా 80వేల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరకు అంచనాలతో రివర్ ఫ్రంట్ రిటైనింగ్ వాల్ నిర్మాణంపై సమావేశంలో చర్చించారు.
క్షేత్రస్థాయి పరిశీలన...
ఈ అంశంపై సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించారు. ఈ ప్రతిపాదనలపై నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని, మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోజు వారీ పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు నీటిపారుదల, పర్యాటక శాఖల అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాజెక్టుకు ఎలాంటి నిధుల కొరత లేదని కమలాకర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!