'రేపటి హుజురాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే' 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay speech) ఉద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర(praja sangrama yatra) ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం తథ్యమని.. తెరాస డిపాజిట్ కాపాడుకోవటం కోసం కష్టపడుతోందని తెలిపారు. 'ప్రజా సంగ్రామ యాత్ర'లో తన వెంట నడిచిన కార్యకర్తలందరికి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
వాళ్లందరికీ బ్రాండ్ అంబాసిడర్‌ను నేను...
"మీ జోష్ చూస్తే 2023లో అధికారం మనదే అని అర్థమవుతోంది. భాజపా అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరైనా.. మొదటి సంతకం విద్య, వైద్యం పైనే. ఇదే చివరి పోరాటం.. అందుకే పాదయాత్ర చేస్తున్నా. ఈ ఎన్నికల్లో తెరాస బాక్స్‌లు బద్దలే. డిగ్రీ చేసిన శిరీష.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నేను శిరీష లాంటి చెల్లెళ్లకి బ్రాండ్ అంబాసిడర్‌ని. ఎంఏ చేసిన వనజాక్షి చాయ్ దుకాణం నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. గూడు, గుడిసె లేని వాళ్లకు బ్రాండ్ అంబాసిడరే బండి సంజయ్. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్‌ని. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటికీ ప్యాకేజ్ ఇవ్వలేదు... అలాంటి వాళ్లకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి." -- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
సమస్యలే స్వాగతం పలికాయి..
పాదయాత్రలో మొత్తం 348 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయ, కార్యకర్తల అండతో... ఎండలో ఎండి, వానలో తడుస్తూ.. 36 రోజులు పాదయాత్ర చేశినట్టు వివరించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, భూనిర్వాసితులు... ఇలా ఎందరో తమ బాధలను చెప్పుకున్నట్టు తెలిపారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని.. ఇప్పటికీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని మండిపడ్డారు. 'వరి వేస్తే ఉరే' అని రైతులను కేసీఆర్ భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడికి వెళ్లినా... సమస్యలే స్వాగతం పలికాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని కుట్రలు చేసినా ఈటలదే విజయం..
"స్కూళ్లలో వనరులు, సిబ్బంది లేని పరిస్థితి. కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలు చెప్తుంటే... ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రజల ఆకాంక్ష కోసమే పాదయాత్ర చేపట్టాం. ప్రజా సమస్యలే మా అజెండా. ప్రజా సంగ్రామ యాత్రను ఆపే పరిస్థితే లేదు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాక మళ్లీ పాదయాత్ర చేస్తాం. తెరాస పార్టీ.. అధికార దుర్వినియోగంతో ఎన్ని కుట్రలు చేసినా... ప్రజలు ఈటలనే గెలిపిస్తారు. అభివృద్ధి గురించి మాట్లాడితే... బండి సంజయ్ మతతత్వం రెచ్చగొడుతున్నాడని అంటున్నారు. హిందూ ధర్మం కోసం భాజపా కచ్చితంగా పోరాటం చేస్తుంది. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతతత్వమా..?. రాజాకార్లు, తాలిబన్ల రాజ్యం కావాలా..? రామరాజ్యం తెచ్చే భాజపా కావాలా..? ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే భాజపా అధికారంలోకి రావాలి. గోల్కొండ మీద కాషాయ జెండా ఎగురవేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేపటి హుజురాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే. హుజురాబాద్ గెలుపు తర్వాత రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపడతాం." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: