Bandi Sanjay Padayatra update: నిర్మల్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో పాదయాత్రకు అనుమతి నిరాకరణపై భాజపా హైకోర్టును ఆశ్రయించింది. నిర్మల్ పోలీసులు అనుమతి నిరాకరించడంపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతిస్తే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగనుంది.
Bandi Sanjay Padayatra: మరోవైపు బండి సంజయ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అసలు ఏం జరిగిందంటే..:నిర్మల్ జిల్లాలో నేటి నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం పార్టీ వర్గాలు ముందుగానే పోలీసుల అనుమతి కోరగా.. పాదయాత్రకు పోలీస్ యంత్రాంగం ఓకే చెప్పింది. దీంతో పార్టీ వర్గాలు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాయి. నేడు ఉదయం బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా.. ఆదివారం పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ సురేశ్ ధ్రువీకరించారు. ఈరోజు నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర చేపట్టాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు 4 విడతల్లో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.