'ఈటల గెలిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా?' హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస బరితెగింపు రాజకీయాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బరి గీసి ధర్మం కోసం భాజపా పోరాడుతోందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో భాజపా ఎన్నికల శంఖారావం సభలో అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ గ్రామంలో గల్లీగల్లీ తిరుగుతూ గడపగడపకు వెళ్లి.. ఈటల రాజేందర్‌ను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు.
కరెన్సీ నోటుకు కమలం పువ్వుకు మధ్య పోరాటం జరుగుతోందని బండిసంజయ్ తెలిపారు. ఈ సంగ్రామంలో కమలం పువ్వుదే విజయమని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఉద్యమస్ఫూర్తిని నింపిన ఉద్యమకారుడు, నాయకుడు ఈటల రాజేందర్‌ను గెలిపించి.. కమలం పువ్వును వికసింపజేయాలని సూచించారు. త్వరలోనే అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
డిపాజిట్లు కూడా రావు..
"ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడు దొంగ దీక్షలే చేసిండు. అబద్దాలు, మాయమాటలు, పిట్టకథలు చెప్పటం కేసీఆర్‌ను వెన్నతో పెట్టిన విద్య. అదే విద్యను తెరాసలోని అందరు నాయకులు అలవర్చుకున్నారు. నిజమైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని ఈటల నింపారు. అలాంటి నాయకున్ని మనమే గెలింపించుకోవాలి. ఆ బాధ్యత కార్యకర్తలదే. ప్రతీ గ్రామానికి వెళ్లాలి. గల్లీగల్లీ తిరగాలి. గడపగడపకు వెళ్లి.. ఈటల రాజేందర్ స్ఫూర్తిని తెలిజేయాలి. భాజపా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తోందో వివరించాలి. ఈ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. తెరాస పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయి. ఒక్కో ఓటుకు పది వేల చొప్పున డబ్బులు పంచుతున్నారు. ఎన్ని పైసలిచ్చినా తీసుకోండ్రి. అడ్డుకోకండి. ఎన్నిస్తే అన్ని తీసుకుని.. ఓటు మాత్రం భాజపాకే వెయ్యాలి. ఒకవేల హుజూరాబాద్‌లో తెరాస గెలవకపోతే.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా..? తెరాస పార్టీకి కేసీఆర్ కుటుంబమే ఓ శని. ఇది నా సవాలు. తెరాస నాయకులు అవాక్కులు, చెవాక్కులు పేలితే.. మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈటలను గెలిపించాల్సిన బాధ్యత మీదే." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెరాసకు గుణపాఠం..
పేద ప్రజల పక్షాన జీవితాంతం నిలబడతానని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ.. తనపై తెరాస దుష్ప్రచారం చేస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెరాస కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈటల ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: