Bandi Sanjay Reacts on RTC Bill in Telangana : ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ న్యాయం చేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో వరదకు కొట్టుకుపోయిన కాల్వ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ అడ్డుకుంటున్నారనే వ్యవహారం, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay fires on CM KCR : ఆర్టీసీ నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని, ఇన్నేళ్లు ఆర్టీసీని ఎందుకు పట్టించుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్కు నాలుగేళ్లు పట్టినప్పడు.. బిల్లు అనుమతిపై ఇప్పుడు గవర్నర్ ఆలోచించకూడదా అంటూ ధ్వజమెత్తారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటారా అని, తప్పు జరిగితే గవర్నర్ మీదకు తోయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు గవర్నర్ పేరు చెప్పి సీఎం కేసీఆరే విలీనాన్ని అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
'వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తానని చెప్పినా అందలేదు. పాత పథకాలు బంద్ చేసి... కేసీఆర్ కొత్తవాటిని ప్రారంభిస్తున్నాడు. ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలనే ఆలోచన చేయలేదు. మద్యానికి 3 నెలల ముందే టెండర్లు వేస్తున్నారు. వర్షాలకు ఎంత నష్టం జరిగిందో ఇప్పటి వరకూ వివరాలు లేవు. ఆర్టీసీ విలీనం చేయాలని నాలుగేళ్లు కేసీఆర్ ఆలోచించారు. ఇప్పుడు గవర్నర్ బిల్లు గురించి ఆలోచించకూడదా? ఆగమేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి పంపాలా? బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది.' - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి సీఎం కాల్చే యత్నం చేస్తున్నారు : ఆర్టీసీ ఆస్తులు.. లీజుకా లేక అమ్మేస్తారా కేసీఆర్ అంటూ సంజయ్ మండిపడ్డారు. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను కాల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు నష్టం కలగకూడదనే గవర్నర్ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో వాటిల్లిన నష్టంపై ఇంతవరకు ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు.