Bandi Sanjay On Group1 Exam Cancellation 2023 :తెలంగాణ సర్కార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు నాశనమైపోతున్నాయని అన్నారు. కనీసం పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించే సత్తా లేని సర్కార్ కేసీఆర్(CM KCR Govt)ది అని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో నియామకాలు జరగడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ సర్కార్ రాష్ట్ర యువత గురించి.. వాళ్ల భవిష్యత్ గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
Telangana Group1 Exam Cancellation 2023 :కరీంనగర్‌లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో బండి సంజయ్(Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కమల నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో బండి మాట్లాడారు. గ్రూప్-1 పరీక్ష రద్దు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ, కేసీఆర్ సర్కార్ విధానాలపై బండి సంజయ్ మండిపడ్డారు. గ్రూప్ -1 పరీక్ష రద్దుకు ముఖ్య కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని.. అందుకే దానికి బాధ్యత వహిస్తూ నిరుద్యోగులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"తెలంగాణ సాధించుకున్న తర్వాతైనా తమ బతుకులు బాగుపడతాయని నిరుద్యోగులు అనుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్(Telangana Group1 Notification 2023) వేస్తే ఎంతో సంబురపడ్డారు. పొట్టకూటికి పైసా లేకపోయినా లక్ష రూపాయలు అప్పు తెచ్చి మరీ కోచింగులకు వెళ్లారు. రాత్రి పగలూ తిండీ తిప్పలు, నిద్ర లేకుండా కష్టపడి చదివారు. ఎలాంటి పండుగలు, సంబురాలు లేకుండా అన్నింటిని వదిలేసి.. ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకుని మరీ చదివారు. ఎట్టకేలకు పరీక్ష రాశారు. తీరా ఫలితాల కోసం చూస్తుంటే పేపర్ లీక్ అంటూ గుండెల్లో పెద్ద బాంబ్ పడింది.
Bandi Sanjay Fires on CM KCR :ఆ షాక్ నుంచి తేరుకునే లోగానే గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దంటూ ఆదేశాలు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే మళ్లీ పరీక్ష పెట్టారు. అక్కడా అవకతవకలే జరిగాయి. మళ్లీ పరీక్ష రద్దు అనే వార్త విని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన చెందుతున్నారు. ఈ పరీక్ష రాసిన వారంతా శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నారు. లక్షరూపాయలతో వాళ్లు కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కోచింగ్ అంతా వృధా అయింది. కేసీఆర్ సర్కారే ఆ డబ్బు వాళ్లకు చెల్లించాలి. గ్రూప్-1 పరీక్ష నిర్వహించే సత్తాలేని కేసీఆర్ ప్రభుత్వమే నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలి." అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.