Bandi Sanjay on Election Competition : తాను రాజకీయాలు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్లడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఓటర్ లిస్టు తయారీలో ఈసీకి సహకరించేందుకు ఏపీకి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే టికెట్ల విషయంలో తమకు ఓ ప్రణాళిక ఉందని వివరించారు. డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ఎక్కడ పోటీ చేయాలో నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదని అన్నారు. దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం (Bandi Sanjay on Telangana Government).. ఖజానా కోసమే ముందస్తుగా మద్యం టెండర్లను పిలిచిందని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోమని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని విమర్శించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
Bandi Sanjay Respond on Peddapalli Girl Case : బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారని బండి సంజయ్ ఆరోపించారు. దిశ కంటే దారుణమైన ఘటన ఇది అని అన్నారు. బీఆర్ఎస్కు చెందిన మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో సీఎంవో నుంచి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.