BJP Maha Jan Sampark Abhiyan in Telangana : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. ఊపు మీద ఉన్న కాషాయదళం ఒక్కసారిగా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. నేతల మధ్య విభేదాలు, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట కార్యక్రమాల నిర్వహణ లేక పార్టీలో నెలకొన్న స్తబ్ధత తీవ్ర నష్టం చేస్తోందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు'మహా జన్ సంపర్క్ అభియాన్'పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లిలో కార్యకర్తలతో కలిసి 'టిఫిన్ బైటక్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్... అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Bandi Sanjay fires on CM KCR : కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బండి సంజయ్‌ఆరోపించారు. ధరణి మంచి పథకమే కానీ.. అది కేసీఆర్ కుటుంబానికే ఆసరాగా మారిందని ధ్వజమెత్తారు. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు రాబోతున్నాయని.. గెలుస్తామని కాంగ్రెస్ కలలు కంటోందని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడే పార్టీ కాదని పేర్కొన్నారు. బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తే గెలిచే విధంగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు.