bandi on dharani: ధరణి అనే దరిద్రపు పోర్టల్ తెచ్చి తెరాస ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తన కుటుంబసభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ధరణి వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. ధరణి పోర్టల్, పోడు భూముల సమస్యలపై కరీంనగర్‌లో రెండు గంటల పాటు చేపట్టిన మౌనదీక్ష అనంతరం బండి సంజయ్ మాట్లాడారు.
తన కుటుంబసభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని సంజయ్ విమర్శించారు. వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ తన బంధువుల పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయన్న ఆయన.. సుమారు 15 లక్షల ఎకరాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదన్నారు. ధరణి లోపాల దరఖాస్తులతో రెవెన్యూ ఆఫీసులు నిండిపోయాయని పేర్కొన్నారు. భూ సమస్యలపై అడిగేందుకు వెళితే.. తమ చేతిలో ఏమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనులపై దండయాత్ర..: మరోవైపు పోడు భూములను నమ్ముకుని బతుకుతున్న గిరిజనులపై కేసీఆర్ దండయాత్ర చేయిస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పడం.. మాట తప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ధరణి, పోడు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చేదాకా తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తెచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. తన కుటుంబసభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే ధరణి తెచ్చారు. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయి. రెవెన్యూ ఆఫీసులు ధరణి లోపాల దరఖాస్తులతో నిండిపోయాయి. కేసీఆర్ తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం.. మాట తప్పడం అలవాటుగా మారింది. ధరణి, పోడు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు