Bandi Sanjay Comments On BRS :బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తోందని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏల్లో బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక కాపువాడలో పాదయాత్ర చేపట్టిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా.. అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం : బండి సంజయ్
Telangana Assembly Elections 2023 :రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. అలాగే కరీంనగర్లో బీఆర్ఎస్ నేతపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ చర్యల వల్ల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని.. గంగుల ఓడిపోతాడని వాళ్ల పార్టీ అధ్యక్షుడే ఆయన బీఫారం ఇవ్వడానికి వెనుకాడారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.
Bandi Sanjay Fires on KCR :సీఎం కేసీఆర్(CM KCR) కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని బండి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా ఫర్వాలేదు కానీ.. బీజేపీ మాత్రం గెలవకూడదనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై నెలకొన్న ప్రజా వ్యతిరేకత ఓటును చీల్చేందుకు.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.