తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Arrest: బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు - police disrupts bandi sanjay jagarana deeksha

బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు

By

Published : Jan 2, 2022, 10:24 PM IST

Updated : Jan 3, 2022, 6:36 AM IST

22:22 January 02

బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు

బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు

Bandi Sanjay Arrest : ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించగా... దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య... పలుమార్లు తోపులాటలు జరిగాయి. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో.. కొందరు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారంటూ కార్యకర్తలంతా సమీపంలోని ఓ రోడ్డు వైపునకు ఒక్కసారిగా పరుగెత్తారు. పోలీసులు కూడా వారి వెనకాలే వెళ్లగా... మరోమార్గం నుంచి వచ్చిన సంజయ్‌ను నాయకులు, కార్యకర్తలు... కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. కార్యకర్తలు గేటుకు తాళం వేయగా సంజయ్‌ జాగరణ దీక్షను ప్రారంభించారు.

తలుపులు, తాళాలు బద్దలుకొట్టి

ఈ క్రమంలో భాజపా కార్యకర్తల్ని నిలువరించిన పోలీసులు... కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. అప్పటికే లోపల ఉన్న శ్రేణులు... తమ నాయకుడిని అరెస్టు చేస్తే పెట్రోల్‌ పోసుకుంటామని హెచ్చరించగా... ముందస్తు చర్యల్లో భాగంగా అగ్నిమాపక శకటాన్ని తెప్పించి కార్యాలయం లోపల నీళ్లు చల్లించారు. రాత్రి పదిన్నర గంటలకు తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి.. లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయమైనట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. సంజయ్‌ని మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా...అక్కడే దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: సంజయ్‌

ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార గర్వంతో సీఎం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, శాంతియుతంగా తాము చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల కార్యక్రమాలకు కొవిడ్‌ నిబంధనలు వర్తించవా..? అని అడిగారు. తన పార్లమెంట్‌ కార్యాలయం వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా సిబ్బంది గాయపడ్డారని.. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న దీక్షను బలవంతంగా ఆపడం సరైనది కాదన్నారు. పోలీసుల ప్రవర్తనను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానని.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ఇచ్చేలా చూస్తామని సంజయ్‌ తెలిపారు.

పోలీసులపై ఎదురుడాది చేసినందుకు సంజయ్‌పై కేసు: సీపీ

బండి సంజయ్‌ దీక్షకు సంబంధించి ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించినందుకు అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. పోలీసులపై ఎదురుదాడి చేసినందుకు సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు.

బండి సంజయ్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం.. ఈటల

ఉద్యోగుల బదిలీల విషయంలో దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడాన్ని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. భాజపా కార్యాలయంలో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు. బండి సంజయ్, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తున్నారని, వారిపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమని ఈటల విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా: కిషన్‌ రెడ్డి

జాగరణ దీక్షకు దిగిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్‌ ఎంపీ అని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు కూడా అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయ గేట్లను విరగ్గొట్టి లోపలికి వెళ్లడం అప్రజాస్వామికమన్నారు. ఎంపీ అనే కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడం తీవ్ర విషయమని కిషన్‌రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌ చేస్తోంది ‘జాగరణ’ మాత్రమే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 3, 2022, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details