Raman singh on telangana: భాజపా కార్యకర్తలు యుద్ధం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నియంత పాలనను అంతం చేసేందుకు కష్టపడి పనిచేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణకాండ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణలో రాక్షస, నియంత, గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామన్నారు. కరీంనగర్లో బండి సంజయ్‌ను ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పరామర్శించారు. పోలీసులు భాజపా కార్యకర్తలతో పాటు జర్నలిస్టులను కూడా కొట్టారని బండి సంజయ్ వెల్లడించారు. ఎన్ని కేసులు పెట్టినా భాజపా వెనుకంజ వేయదన్నారు. బహిరంగ ప్రదేశంలో వద్దని... తన కార్యాలయంలో దీక్ష చేపట్టినట్లు సంజయ్ తెలిపారు. 317 జీవోను సవరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను రాత్రి అరెస్టు చేసి తెల్లవారేవరకు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. కేసీఆర్‌ను జైలుకు పంపాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.
ధర్మయుద్దం ప్రారంభించినం..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇంతటి గొప్ప పార్టీలో కొనసాగడం అదృష్టం. మొన్నటి ఘటనలో జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు. అయినా మౌనంగా ఉండటం బాధేస్తోంది. మాజీ ఎమ్మెల్యే చూడకుండా.. ఈ ఘటనతో సంబంధం లేకపోయినా బొడిగె శోభను అరెస్టు చేయడం దారుణం. చాలా రోజుల నుంచి 317 జీవోను సవరించాలని పోరాడుతున్నం. సీఎం సోయిలోకి రావాలని దీక్ష చేస్తుంటే గ్యాస్ కట్టర్లు, గునపాలు పెట్టి గేట్లు బద్దలు కొట్టి పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి?. మళ్లీ డిమాండ్ చేస్తున్నా.. 317 జీవోను సవరించాలి. ధర్మయుద్దం ప్రారంభించినం. మెడలు వంచైనా సరే జీవోను సవరింపజేస్తం. గడీలు బద్దలు కొట్టడం ఖాయం. 317 జీవోను సవరించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు