తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికార ఠీవికి నిదర్శనంగా నిలిచిన వాహనాల వేలం - Jeep exhibition in karimnagar

ఒకప్పుడు గ్రామాల్లో జీపు శబ్ధం వినిపిస్తే తహసీల్దార్‌‌, పోలీసులు వస్తున్నారని ప్రజలు ఆసక్తిగా చూసేవారు. అలాంటి అధికార దర్పానికి నిదర్శనంగా నిలిచిన వాహనాలు ప్రస్తుతం కలెక్టరేట్ ప్రాంగణంలో సేదతీరుతున్నాయి. ప్రభుత్వాలు మారడం... అధికారులకు కొత్త వాహనాలు మంజూరు చేస్తుండటం వల్ల పాత వాహనాల మరమ్మతు చేసే కంటే కొత్తవి కొనుగోలు చేయడం శ్రేయస్కరమనే అభిప్రాయం కనిపిస్తోంది. పాతబడిన వాహనాలను అమ్మకానికి పెట్టగా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

అధికార ఠీవికి నిదర్శనంగా నిలిచిన వాహనాల వేలం
అధికార ఠీవికి నిదర్శనంగా నిలిచిన వాహనాల వేలం

By

Published : Jan 3, 2021, 12:20 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలలో అధికారులు ఉపయోగించిన వాహనాలను వేలం వేయడానికి నిర్ణయించారు. గతంలో రెవెన్యూ, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖలకు ఉపయోగపడిన వాహనాలన్నింటిని కలెక్టరేట్ ప్రాంగణంలో పార్క్‌ చేశారు. ఒక్కసారిగా 20 వాహనాలు ఉండేసరికి ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వాహనాలన్నీ ఒకేచోట...

మారుతున్న అవసరాలు రవాణా రంగంలో వస్తున్న మార్పుల కారణంగా జీపు అనే పదం పుస్తకాలకే పరిమితమౌతుందేమోనని పలువురు వ్యాఖ్యానించారు. గతంలో రోడ్లు సరిగ్గా లేని కాలంలో ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడ్డాయని... అలాంటి వాహనాలన్నీ ఒకే చోట కనిపించడం ఆసక్తిగాను కొంత బాధగాను ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రూ. 25వేల ధరావత్తు...

వాహనాల వేలంలో పాల్గొనాలంటే ఒక్కో దానికి రూ. 25వేల ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనడానికి ఔత్సాహికులు వెనుకంజ వేస్తున్నారు. కొందరు మాత్రం వాహనాలు విక్రయించే కంటే మరమ్మతులు చేయించి సైన్యానికి ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరు పాత జీపులను ఆసక్తిగా చూడటమే కాకుండా ఆ వాహనాలతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

గత వైభవానికి నిదర్శనంగా నిలిచిన వాహనాలను మరమ్మతు చేసి ప్రదర్శనకు పెడితే బాగుంటుందని త్వరగా వేలం పూర్తి చేయాలంటే మాత్రం ధరావత్తు సొమ్ము తగ్గిస్తేనే సాధ్యమౌతుందని పలువురు సూచిస్తున్నారు.

ఇవీచూడండి:అదొక ప్రత్యేక ప్రపంచం... ఆధునిక ‘బృందా’వనం

ABOUT THE AUTHOR

...view details