తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు

another-500-crores-has-been-released-to-huzurabad-for-dalithbandhu
హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు

By

Published : Aug 23, 2021, 10:05 AM IST

Updated : Aug 23, 2021, 12:09 PM IST

10:02 August 23

దళితబంధు కోసం రూ.2 వేల కోట్ల నిధులు విడుదలకు సీఎం ఆదేశం

         దళితబంధు పథకం కింద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలెట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

         మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన 500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన 500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు మొత్తం వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. వారం రోజుల్లోపు మరో వెయ్యి కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దశల వారీగా అమలు

        రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పథకం అమలుకు ముందుగా అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో దళితబంధు అమలు కానుంది.

అన్ని రకాలుగా అండగా ఉండేలా..

         వార్డు, గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేకాధికారులను నియమించారు. కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కాకుండా దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, వసతి గృహాలు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం... దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

ఉద్యమంలా తీసుకుపోయేలా..

          దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా "దళిత రక్షణ నిధి"ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ప్రారంభించింది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణనిధి నిధి నుంచి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చూడండి:ఆటోడ్రైవర్‌ను నిండా ముంచిన 1234 పిన్‌ నంబరు

Last Updated : Aug 23, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details