అనాథలకు అన్నీ తామై అండగా నిలబడడమే కాకుండా వారికి పెళ్లి చేసి వారి భవిష్యత్తుకు దారి చూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు కరీంనగర్‌కు చెందిన ఓ అనాథ ఆశ్రమ నిర్వాహకులు. కన్నవాళ్లే కాదనుకున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తోంది ఆశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మ.
ఆరేళ్ల కిందట అనాథ.. ఇప్పుడు ఓ యింటివెలుగు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెళ్లికి చెందిన ఎనుగుల యమున అనే యువతి ఆరేళ్ల కిందట తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నాడు. నా అన్నవాళ్లు లేని ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకుంది అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మారెడ్డి. ఆ యువతిని పెద్దచేసి తగిన వరుడుని చూసి ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరాడంబరంగా పెళ్లి చేసి అత్తింటికి సాగనంపారు.