రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ హుజురాబాద్ ఉపఎన్నిక కోసమేనా..? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు మంత్రులు తలసాని, కొప్పుల ఈశ్వర్.. గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. హుజూరాబాద్ పరిధిలోని 5 మండలాలకు.. ఐదు వందల గొర్రెల యూనిట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, భాజపా నేతలపై ఆయన విమర్శలు చేశారు. భాజపా నేతలకు దమ్ముంటే.. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలని తలసాని సవాల్ చేశారు. దళిత బంధు వంటి మహత్తర పథకంపైనా విపక్షాలు విమర్శలు చేయడం తగదని.. తలసాని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేంటని తలసాని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని మంత్రి అన్నారు.
'ఎస్సీ, బీసీ, మైనార్టీలు, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ముఖ్యమంత్రి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేతన్న, గీతన్న, నాయీబ్రాహ్మణులు, చేనేత వర్గాలకు.. తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే మేలు జరుగుతోంది. 24 గంటల విద్యుత్, ఎల్లంపల్లి ద్వారా నీళ్లు.. సహా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే వచ్చాయా.. ఇక్కడకు కొందరు వస్తున్నారు... వారి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. వారికి దమ్ముంటే రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలి.'