కరోనా కాలంలో తాను చేసిన సేవలకు విపక్షాలు కొనియాడినప్పటి నుంచి కేసీఆర్ తనను కళ్లలో పెట్టుకున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. కమలాపూర్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం చేయగా.. సతీమణి జమున ఇంటింటా ప్రచారం చేశారు. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసినప్పుడు.. అసెంబ్లీలో ప్రతిపక్షాలు సైతం గొప్పగా పనిచేశానని కితాబు ఇస్తే.. సభలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం తనను కంట్లో నలుసులా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకునూరి మురళి అనే దళిత బిడ్డను అవమానిస్తే రాజీనామా చేసి ఆంధ్రాకు పోయిండని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను హింస పెడితే రాజీనామా చేసి బయటకు వచ్చిండని ఈటల అన్నారు. తాను మంత్రిగా పని చేసినప్పుడు ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీ అధికారి లేరని అడిగితే తన నోరు మూయించారని.. ఇప్పుడు రాహుల్ బొజ్జను నియమించారని అన్నారు. ఈసారి ఈటల దెబ్బకు హుజురాబాద్‌కే కాదు.. రాష్ట్రమంతా లాభం జరిగిందని అన్నారు. ఎవరి జాగాలో వారు ఇల్లు కట్టుకోవడానికి జీవో ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించాలని బానిసల్లా తిరుగుతున్న నాయకుల భరతం పట్టే రోజులు త్వరలో వస్తాయని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
భాజపా చేసింది శూన్యం: కొప్పుల
రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబురాల వేళ.. హుజూరాబాద్ ఉపపోరు ప్రచారం జోరుగా సాగుతోంది. జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారం చేశారు. భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్న కొప్పుల కనీసం సర్పంచ్ పదవి లేని రాజేందర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఆ తర్వాత మంత్రి పదవి కేసీఆర్ కట్టబెట్టారని గుర్తు చేశారు.