తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం(Huzurabad by election campaign)లో దూసుకుపోతున్నారు. హనుమకొండ జిల్లా శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజులపల్లిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని... కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తెరాసకు ద్రోహం చేసిన ఈటలకు ఉపఎన్నికలో బుద్ధిచెప్పాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కోరారు.
ఈటల సవాల్...
హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election campaign)లో తెరాసకు దీటుగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు, కొత్తపల్లిలో ఓటర్లను కలిశారు. గ్రామస్థులు ఈటలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు ఉంటేనే ప్రజలు గుర్తుకు వస్తారని...లేదంటే జనాన్ని పట్టించుకోరని ఈటల ఆరోపించారు. సానుభూతి కోసం దాడి చేయించుకుంటానని తనపై దుష్ప్రచారం చేశారని.. అంతటి నీచానికి తెరాస నేతలు దిగజారారని దుయ్యబట్టారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఈటల... గెలిస్తే సీఎం కేసీఆర్ శాసనసభకు రాకూడదని సవాల్ విసిరారు.
వెంకట్ ప్రచారం...
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (Congress Candidate Balmuri Venkat) ప్రజలతో మమేకమవుతున్నారు. హుజూరాబాద్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని వెంకట్ ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను భాజపా, తెరాస పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. యువత గొంతునై పోరాడేందుకు హుజూరాబాద్‌లో తనను గెలిపించాలని బల్మూరి వెంకట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.