ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా బరిలో నిలిచినా హూజూరాబాద్ ఉపసమరానికి సర్వం సిద్ధమైంది. తెరాసపై గెలుపొందిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇందుకు సంబంధించి శనివారం జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ కొనసాగనుంది. 2లక్షల 37వేల 22మంది ఓటర్లు ఉండగా వీరిలో లక్షా 17వేల 922 మంది పురుషులు, లక్షా 19వేల 99మంది మహిళలు ఉన్నారు. 30మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ఈవీఎం ద్వారా ఓటింగ్ జరగనుంది.
అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లోని 106 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణపై ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా పెట్టనున్నారు. అత్యంత సమస్యాత్మకమే కాకుండా అన్నిచోట్ల ఎన్నికల తీరును నిరాంతరాయంగా పరిశీలించనున్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను రికార్డు చేస్తాం.
-శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.
గుర్తింపు కార్డు పక్కా.. ఫోన్లు వద్దు
పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఓటర్ స్లిప్ గుర్తింపుకార్డు కాదన్న అధికారులు... కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ తెలిపారు.
ఎన్నికల సందర్భంగా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశాం. సోలార్ లైట్లు కూడా ఏర్పాటు చేశాం. ఓటు వేసేందుకు వెళ్లే ప్రతి ఒక్కరు ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ లేదా ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్ అనుమతి లేదు. ఓటర్లు గాని పోలింగ్ ఏజెంట్లు గాని ఎవ్వరూ ఫోన్ తీసుకెళ్లకూడదు.