woman attempt to kidnap a boy in karimnagar: ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల అపహరణలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయిస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందినవారే ఎవరూ లేని సమయంలో అదును చూసి పిల్లలను అపహరిస్తున్నారు. ఎవరైనా చూసి పట్టుకోగలిగితే సరి లేకపోతే పిల్లలు లేని వారికి విక్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఎవరూ లేనిది చూసి అదే గ్రామానికి చెందిన పిల్లాడిని ఆటోలో ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది ఓ మహిళ. అనుమానంతో స్థానికులు ఆరాతీయగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది:కరీంనగర్ జిల్లా రామడుగులో మూడేళ్ల బాలుడు వానరాసి రాంప్రసాద్‌ను ఓ మహిళ అపహరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళ బాలుడు బయట తిరుగుతుండగా గుట్టుచప్పుడు కాకుండా ఆటోలో ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. స్థానిక మహిళ ఇంటి ముందు నుంచే బాలుడిని ఎత్తుకుని ప్రయాణికుల ఆటోలో కరీంనగర్ వైపు బయలు దేరింది. బాలుడు ఇంట్లో కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులందరు వెతకడం ప్రారంభించారు. స్థానికులిచ్చిన సమాచారంతో... ఆటోలో ఓ మహిళ తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళుతున్న సదరు మహిళకు పిల్లలు లేరు. అయినప్పటికీ తన కొంగు చాటున బాలుడు ఉండటం తాము చూసినట్లు చెప్పారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు ఆటోను వెంబడిస్తూ పోలీసులకు సమాచారమిచ్చారు. ఐదు కిలోమీటర్ల దూరం వెంబడించాక.. ఆటోను ఆపి సోదా చేయగా అసలు విషయం బయటకొచ్చింది.