కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మోతె పద్మ, రమేష్ దంపతులు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వారికి నెల రోజుల క్రితం పాప పుట్టింది. ఇటీవల భర్తతో గొడవపడి పద్మ పుట్టింటికి వచ్చేసింది.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి - telangana latest news
ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బిడ్డను అమ్మగా వచ్చిన సొమ్ము వల్ల కుటుంబంలో వివాదం తలెత్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన తల్లి కనకమ్మతో కలిసి బిడ్డను అమ్మకానికి పెట్టింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులకు చెందిన రేవెల్లి సంపత్ దంపతులకు రూ.1.10లక్షలకు బిడ్డను కొనుక్కునేందుకు ఒప్పందం కుదుర్చకున్నారు. నాలుగు రోజుల క్రితం డబ్బులు చెల్లించి శిశువును తీసుకెళ్లారు. వచ్చిన సొమ్ముపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. ఈ నెల 27న పద్మ తండ్రి యాకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రేవెల్లి సంపత్ దంపతుల నుంచి శిశువును తీసుకుని పద్మకు అప్పగించారు.
ఈ విషయాన్ని కరీంనగర్‌లోని ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు తెలపగా... వారు వీణవంక వచ్చి పద్మ కుటుంబీకులను విచారించారు. శిశువుని విక్రయించటం, కొనటం నేరమని ఐసీపీఎస్ అధికారి స్పష్టంచేశారు. విచారణ నివేదికను సీడబ్ల్యూసీ ముందు ఉంచుతామన్నారు. కమిటీ పూర్తిగా విచారిస్తుందని తెలిపారు. శిశువుతో పాటు పద్మను, ఆమె తల్లిని కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.