తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నీళ్ల మంటతో చలికాచుకుంటున్న కుటుంబం... అర్థిస్తోంది దాతల సాయం - కరీంనగర్​లో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం

ఇంటి పెద్దదిక్కు అకాల మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొడుకు చేత తలకొరివి పెట్టించుకోవాలనుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. కూడు, గూడు, తోడు కరవై వణికిస్తున్న చలిలో కన్నీళ్ల మంటతో చలి కాచుకుంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం, దాతలు దయతలచి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

నీడలేని ఆ కుటుంబం అర్థిస్తోంది సాయం..
నీడలేని ఆ కుటుంబం అర్థిస్తోంది సాయం..

By

Published : Nov 6, 2020, 2:55 PM IST

నీడలేని ఆ కుటుంబం అర్థిస్తోంది సాయం..

కుమారుడి అకాల మరణం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. భర్తను కోల్పోయిన భార్య.. తండ్రి లేని ఆ పిల్లలు రోడ్డున పడ్డారు. వయసు పైబడిన తల్లిదండ్రులు, అనారోగ్యంతో బాధపడే భార్య, ఇద్దరు పిల్లలు... నిలువ నీడ లేక నిర్మాణంలో ఉన్న కుల సంఘం భవనంలో తలదాచుకుంటున్నారు. కూలీ చేస్తే కాని పూటగడవని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం... దాతల సాయం అర్థిస్తోంది.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన తిరుపతి అనారోగ్యంతో అక్టోబరు 18న మృతిచెందాడు. రెక్కల కష్టం మీద రోజులు నెట్టుకొస్తున్న ఆ కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. అద్దెకు ఇల్లు లభించకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకుంటున్నారు. ప్రహరీ లేని భవనంలో వృద్ధులు, పిల్లలు చలికి వణికిపోతున్నారు. అప్పుచేసి చేపట్టిన ఇంటి నిర్మాణం... తిరుపతి మరణంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. పిల్లలు, అనారోగ్యం, వృద్ధాప్యంతో బతుకు భారమైందని తిరుపతి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

దిక్కుతోచని స్థితిలో...

లోకం తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన చిన్నారులు... చలికి వణికుతూ అరుగులపైనే పడుకోవడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తిరుపతి భార్యకు 3 శస్త్రచికిత్సలు కావడం వల్ల కూలీ చేసే పరిస్థితి లేదని వాపోయింది. ఇంటి నుంచి ఎవ్వరు ఎప్పుడు పొమ్మంటారో.. ఎప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ప్రభుత్వం, దాతలు దయతలచి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వారికో నీడనివ్వండి...

ప్రభుత్వం స్పందించి రెండుపడక గదుల ఇల్లు కేటాయించి.... పిల్లలను ప్రభుత్వ వసతి గృహంలో చదివించాలని స్థానికులు కోరుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ భూముల్లోని పేదల నివాసాల కూల్చివేత.. ఆందోళనలో బాధితులు

ABOUT THE AUTHOR

...view details