హుజూరాబాద్‌లో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కేసు (Case On Etela Rajender) నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈటల రాజేందర్‌పై కేసు ఫైల్ అయింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సభ పెట్టారన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా హుజూరాబాద్ ఉపఎన్నిక రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే భాజపా, తెరాస జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థిని ప్రకటించి తన వంతుగా ప్రచారం చేసుకుంటోంది.
ఖరీదైన ఎన్నికలు..
హుజూరాబాద్ ఉపఎన్నికలు(huzurabad by election 2021) దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ప్రచారం జరుగుతోంది. ఆత్మగౌరవం పేరుతో బరిలో దిగిన ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు భాజపా ఓవైపు.. ఎలాగైనా విజయభావుటా ఎగరేసి పరువు కాపాడుకోవాలని అధికారపార్టీ తెరాస మరోవైపు.. తన ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ ఇంకోవైపు.. రసవత్తర ప్రచారం జరుగుతోంది.
అన్ని రకాల ప్రయత్నాలు..
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికలకు మరో పక్షం రోజులే గడువు ఉండటంతో.. ఆయా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఆ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర ముఖ్య నేతలంతా హుజూరాబాద్‌లో మకాం వేసి.. కేడర్‌తో కలిసిపోయి పనిచేస్తున్నారు.
ఆరోపణ ప్రత్యారోపణలు..
కులాలు, వర్గాల వారిగా ఆత్మీయసమావేశాలు, సభలు, రోడ్‌షోలతో పాటు నాయకులు నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. భాజపా, తెరాస నాయకులు.. ఒకరి మీద ఒకరు విమర్శలతో హోరెత్తిస్తూ.. ఆకర్షిస్తున్నారు. ముఖ్య నాయకులంతా బరిలో దిగి.. తమతమ పార్టీల పథకాలను వివరిస్తూ.. తమ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మంత్రిగా ఇన్ని రోజులుండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఈటలపై తెరాస నాయకులు ఆరోపణలు చేస్తే.. చేసేంత అవకాశమే ఇవ్వకుండా చేస్తున్నారని ప్రత్యారోపణలు చేసుకుంటూ.. జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
చాటుమాటుగా..
ఇది ఒక వైపు అయితే.. డబ్బుల ప్రాబల్యంతో ఓటర్లను ఆకర్షించే పద్ధతి మరోవైపు చాటుమాటుగా జరుగుతూనే ఉంది. సాయంత్రం వేళల్లో జరిగే సభలతో పాటు ఉదయం వేళల్లో ప్రచారానికి పార్టీ నాయకులు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఉదయం ప్రచారానికి వస్తే 300 రూపాయలతో పాటు టిఫిన్లు, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నారు. సాయంత్రం వేళల్లో జరిగే ధూంధాంతో పాటు రోడ్‌షోలకు జనాన్ని తరలించాలంటే మరో ధర చెల్లించాల్సిన డిమాండ్ ఏర్పడింది. ఇలా డబ్బులు యథేచ్ఛగా పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి:అత్యంత ఖరీదుగా హుజూరాబాద్ ఎన్నిక.. ఓట్ల కోసం ఏమాత్రం వెనకాడని నేతలు..