కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన దంపతులు సుబేదారి రమేశ్, సరితలకు ఇద్దరు సంతానం. రమేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుమార్తె నందిని డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కుమారుడు అజయ్ 12వ ఏట 2020లో బడిలో ఆడుకుంటూ పడిపోయాడు. లేవలేక ఇబ్బంది పడుతుంటే.. రమేశ్ దంపతులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇచ్చిన మందులు వాడినా.. సమస్య తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు.
ఆడుకునే వయసులో ప్రాణాంతక వ్యాధి.. సాయం కోసం కన్నవాళ్ల ఎదురుచూపు - what is Muscular dystrophy disease
అదో నిరుపేద కుటుంబం.. చెంగున దూకాల్సిన వయసులో కుమారుడు జబ్బుతో మంచానికే పరిమితమయ్యాడు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కొడుకు వైద్యానికి సొమ్ము లేక.. రోజురోజుకు దిగజారిపోతున్న అతడి ఆరోగ్యస్థితిని చూసి తట్టుకోలేక ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. తమ కుమారుడి చికిత్సకు సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
అజయ్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడికి ‘మస్క్యులర్ డిస్ట్రఫీ’ అనే వ్యాధి వచ్చిందని, చికిత్సకు రూ.కోట్లలో ఖర్చవుతుందని చెప్పారు. దీంతో రమేశ్ దంపతులు హతాశులయ్యారు. ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న ఆ కుర్రాడు పూర్తిగా కదలలేని స్థితికి వచ్చాడు. ఒకచోట నుంచి మరోచోటకు ఎత్తుకుని తీసుకెళ్లాల్సిందే. సొంతంగా నీళ్లు కూడా తాగలేడు. ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాల్సిన స్థితి. దీనికితోడు రమేశ్ ఇటీవల ప్రమాదానికి గురికాగా కాలు విరిగింది. వైద్యానికి అప్పు తెచ్చి రూ.రెండు లక్షలకు పైగా ఖర్చు చేశారు. కనీసం సొంత ఇల్లు కూడా లేని ఆ దంపతులు కుమారుడి వైద్యానికి దాతలెవరైనా చేయూతనిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయదలచిన వారు సుబేదారి రమేశ్ ఫోన్‌పే నంబరు 81870 53654కు డబ్బు పంపవచ్చు.