కరీంనగర్ జిల్లాలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసులు వందకు పైగా వెలుగు చూస్తుండగా.. మరోవైపు అత్యధికులు హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కువ మంది ఆసుపత్రులలో చేరకుండా ఇంట్లోనే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అద్దె ఇళ్లలో ఉండే వారికి కరోనా వస్తే ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు పంపించే వారు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్దె ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందేందుకు కొందరు యజమానులు అవకాశం ఇస్తున్నారు.
కరోనా బాధితుల్లో 90శాతం హోం ఐసోలేషన్లోనే... - covid cases
కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతూ కోరలు చాస్తోంది. ఇదిలా ఉండగా... కరోనా బాధితులు మాత్రం ఎలాంటి హైరానా లేకుండా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్లోనే 90 శాతం మంది ఉంటూ... కరోనాను తరిమికొడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాటికి నమోదైన పాజిటివ్ కేసులలో 90శాతం మంది హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 3,994మంది పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతుండగా 3,651మంది అనగా 90శాతం మంది ఇళ్లలో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం 343మంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 11మంది, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 82మంది, శాతవాహన ఐసోలేషన్‌లో 39మంది, జమ్మికుంటలో 10మంది చికిత్స పొందుతుండగా మిగిలిన వారంతా కరీంనగర్, హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రులలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 153మంది జిల్లా వ్యాప్తంగా మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత తెలిపారు.
1.17లక్షలు దాటిన పరీక్షలు
జిల్లాలో కరోనా పరీక్షలు 1.17లక్షలకు చేరాయి. ర్యాపిడ్ యాంటీజెన్ 87,329 నిర్వహించగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలు 30,294మందికి పరీక్షలు చేశారు. మొత్తం ఈ సంఖ్య 1,17,626కి చేరింది. మంగళవారం రెండు రకాల పరీక్షలు కలిపి 1828మందికి నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం కరీంనగర్ జిల్లాలో 109మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.