కరీంనగర్‌పై కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. నానాటికీ భారీగా పెరగుతున్న కేసులతో కలవరానికి గురిచేస్తోంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా జిల్లావ్యాప్తంగా 41 మందికి పాజిటివ్ నిర్ధరణ అయిందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇందులో జిల్లా కేంద్రంలోనే 30కి పైగా ఉన్నట్లు తెలిసింది.
గడిచిన నాలుగైదు రోజులుగా ఊహించని విధంగా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 396 కేసులు ఉండగా కొత్తగా ప్రకటించిన కేసులు 41 కలిపి వీటి సంఖ్య 437కి పెరిగింది. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారి ఇళ్ల చెంత రసాయన ద్రావణాల్ని చల్లించడంతో పాటు వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారిని కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండమనేలా సూచనల్ని అందిస్తున్నారు.
ఒకే ఇంట్లో 12 మందికి కరోనా..
పట్టణంలోని బొమ్మకల్ రజ్వీచమన్ ప్రాంతంలో ఓ కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా సర్వైవల్ అధికారి తెలిపారు. ఫలితంగా అప్రమత్తమైన పోలీసులు ఆ రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబంలోని పెద్ద అనారోగ్య కారణంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతని ద్వారా కుటుంబ సభ్యులకు సక్రమించిందా లేక మరే ఇతరత్రా కారణాలతో సంక్రమించిందా అనేది కుటుంబ సభ్యులకు అంతు చిక్కటం లేదు. ఇటీవల పరీక్షలు నిర్వహించగా మంగళవారం కుటుంబ సభ్యులందరికి పాజిటివ్ రాగా.. వారందరిని హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వారు నివసించే ఏరియాకు వ్యక్తులు, వాహనాలు వెళ్లకుండా రూరల్ ఠాణా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
జమ్మికుంటలో ఐదుగురికి..
జమ్మికుంటలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్డర్ జువేరియా, వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి రఘుపతి పేర్కొన్నారు. వీరిలో ఎంప్లాయిస్ కాలనీకి చెందిన ముగ్గురికి, పద్మశాలి వీధిలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వీరిని హోం ఐసోలేషన్ చేశామని వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి చెప్పారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. 39,342కు చేరిన బాధితులు