Anganwadi Bills pending: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు ఎదురయ్యాయి. నెలల తరబడి అద్దె నిధులు రాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్న భవన యజమానులు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారానికి ఆటంకం కలగకుండా కొంతమంది అంగన్‌వాడీ సిబ్బంది తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు అదనపు నిధులు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినా నేటికీ ఆమోదం లభించలేదు. అద్దెల రూపంలోనే దాదాపు రూ.30 కోట్లు అవసరమని అంచనా.
- రాష్ట్రంలో 35,568 అంగన్‌వాడీ కేంద్రాలుంటే 12,824 కేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.3-4వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకోసారి అద్దెనిధులు మంజూరు చేసినప్పటికీ రెండేళ్లుగా తీవ్రంగా జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాలకు 2021 ఏప్రిల్ నుంచి అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
- అద్దె నిధులు విడుదల చేయాలంటూ ఇటీవల నిజామాబాద్ అర్బన్ జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది సీడీపీవో కార్యాలయం ముందు బైఠాయించారు. తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నామని, నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక కష్టాలు తప్పడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు ఏదోలా సర్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు.
- కరీంనగర్ జిల్లాలో అద్దెభవనాల్లో 255 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే, అక్కడ ఏడాదిగా అద్దె నిలిచిపోయింది.
- జిల్లాల్లో అద్దెబకాయిలు వెంటనే విడుదల చేయాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరితే క్రమశిక్షణ అతిక్రమణ, విధుల్లో నిర్లక్ష్యం పేరిట మెమోలు జారీ చేస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గుతున్నారు.
పాఠశాలల్లోకి బదిలీ...