కరోనా కారణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని చిరు వ్యాపారుల జీవనోపాధి అస్తవ్యస్తంగా మారింది. అలాంటి వారిని గుర్తించి ఆర్థికంగా ఆదుకునేందుకు ‘ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వీధి వ్యాపారుల కోసం ఆత్మ నిర్భర్’ నిధి పథకం సూక్ష్మ రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.
పట్టణాలు, నగరాల్లో చిరు వ్యాపారులు రుణాలు పొందడానికి తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పురపాలిక, నగరపాలికల పరిధిలో వీధి వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఫుట్‌పాత్ వ్యాపారాలు చేసుకునే వారే అధికంగా ఉన్నారు. పండ్లు, టిఫిన్ సెంటర్లు, రహదారులపై కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
లాక్‌డౌన్ సడలించినప్పటి నుంచి చిరు వ్యాపారుల జీవితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని.. ఆ క్రమంలో లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని వెల్లడించారు.
కరోనా కారణంగా వ్యాపారమంతా దెబ్బతిన్నదని.. తిరిగి వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నా చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొందని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ పేరుతో ఒక్కో చిరువ్యాపారికి రూ.10వేల చొప్పన రుణం సూక్ష్మ రుణాలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాది లోపు ఏడు శాతం వడ్డీ రాయితీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.