ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండడం వల్ల కఠిన ఆంక్షలను అధికారులు ఉపసంహరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు మాత్రం యథాతథంగా అమలవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 27 ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు తగ్గడం వల్ల 13 చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఉపసంహరించారు.
కరీంనగర్ జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు
కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం రెండు పాజిటివ్ కేసులు కొనసాగుతుండగా సాహెత్‌నగర్, శర్మనగర్‌లలో మాత్రమే కంటైన్మెంట్ జోన్లను కొనసాగిస్తున్నారు. ముకరంపుర, కశ్మీర్‌గడ్డ, మంకమ్మతోట ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. మరోవైపు హుజూరాబాద్‌లోని కాకతీయ కాలనీ, సిద్దార్థ నగర్, మార్కెట్ ఏరియా, మామినులవాడలో ఆంక్షలను ఎత్తివేశారు.
పెద్దపల్లిలో నిల్... జగిత్యాలలో ఒకటి
పెద్దపల్లి జిల్లాలో ఉన్న రెండు పాజిటివ్ కేసులు నెగెటివ్‌గా వచ్చాయి. కొత్త కేసులేమీ నమోదు కాకపోవడం వల్ల జీఎం కాలనీ, అన్నపూర్ణ కాలనీలో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలను ఉపసంహరించారు. జగిత్యాల జిల్లాలో మూడు పాజిటివ్ కేసులకు గాను ఒక్కరే మిగిలి ఉన్నారు. జిల్లాలోని కోరుట్ల, కల్లూరులో అమల్లో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలను తొలగించారు.
వేములవాడలో 3 కరోనా పాజిటివ్ కేసులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మూడు పాజిటివ్ కేసులు ఉండడం వల్ల స్థానిక సుభాష్‌నగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగిస్తున్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని మసీదుల్లో ప్రార్థనలు చేయకూడదనే నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. రంజాన్ సమయంలో పండ్ల దుకాణాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
ఇవీ చూడండి:కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు