Sharmila Fires On Telangana Government: తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే సమస్యను ధరణి తెచ్చి రైతులు కలెక్టర్ దాకా వెళ్లేలా చేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధరణి పేరు చెప్పి రికార్డ్లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. రూ.5 వేలు రైతు బంధు ఇస్తే రైతులు ఎలా కోటీశ్వరులు అవుతారని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అయినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు లేకపోవడం దారుణమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పెన్షన్ అని చెప్పి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. 13లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రేషన్ షాపుల్లో అన్ని బందు పెట్టి కేవలం దొడ్డు బియ్యం ఇస్తున్నారని విమర్శించారు. ఏడాదిలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని అక్కడి ప్రజలకు వైఎస్ షర్మిల సూచించారు.