Huge Water Flow in Telangana Projects :వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రహదారులు దెబ్బతిని.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తోన్న అధిక వానలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. అంతకంతకూ పోటెత్తుతోన్న వరద ప్రవాహాలతో జలాశయాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులన్నీ.. ప్రస్తుత వర్షాలతో మళ్లీ పూర్వ కళను సంతరించుకుంటున్నాయి.
Telangana Projects Water Flow 2023 : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 29 అడుగులుగా ఉండగా.. రాత్రికి 35 అడుగులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలనాధికారి.. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
రాత్రికి మరింత పెరిగే అవకాశం..: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టులకూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1071.60 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.274 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిజాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయం నీటి మట్టం 1388.32 అడుగులు చేరింది. ప్రస్తుతం కురుస్తోన్న ఏకతాటి వర్షాలతో రాత్రికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, కడెం జలాశయాలూ జలకళను సంతరించుకున్నాయి. స్వర్ణ జలాశయానికి 890 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. కడెం జలాశయానికి 4,280 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. స్వర్ణ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1189 అడుగులు ఉండగా.. ప్రస్తుతం ఇందులో 1164 అడుగుల నీటిమట్టం ఉంది. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 689.42 అడుగులుగా ఉంది.