తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ సంతలో వాహనాలూ దొరుకుతాయ్!

మామూలుగా ఏ సంతలోనైనా... కూరగాయలు, పండ్లు, ఆటవస్తువులు అమ్ముతారు. మహా అయితే.. మేకలు, గేదెలు విక్రయిస్తారు. కానీ ఆ సంతకు వెళ్తే మాత్రం ఎంచక్కా ద్విచక్రవాహనాలు కొనుక్కోవచ్చు. సంతేంటి బైక్​లు కొనుక్కోవడం ఏంటని అనుకుంటున్నారా.. అవును కామారెడ్డిలో నిర్వహించే వారసంతలో కూరగాయలు, పండ్లతో పాటు వాహనాలు విక్రయిస్తున్నారు.

vehicles sale in Kamareddy market
ఈ సంతలో సరకులే కాదు.. వాహనాలూ దొరుకుతాయ్!

By

Published : Jan 2, 2020, 4:51 AM IST

Updated : Jan 2, 2020, 9:12 AM IST

ఈ సంతలో వాహనాలూ దొరుకుతాయ్!

సాధారణంగా కూరగాయలు, పశువుల వారాంతపు సంతలు జరగడం చూసుంటాం. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి మైదానంలో మాత్రం ఎనిమిదేళ్లుగా.. ప్రతి గురువారం నిర్వహించే సంతలో వాహనాల విక్రయం సాగుతోంది. అంగడిలో సరుకులు కొనుగోలు చేసినట్లే నేరుగా విక్రయదారులతో మాట్లాడుకుని ఇక్కడ వాహనాలు కొనుక్కోవచ్చు.

దుబాయ్​లో చూసి... కామారెడ్డిలో ఏర్పాటు

సాధారణంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనాలంటేనే అందరూ జంకుతారు. తెలిసిన వాళ్ల వద్ద తప్ప ఇతరులను నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే సరైన పత్రాలు లేని, పరికరాలు మార్చి మోసం చేసే ప్రవృత్తే అధికంగా కనిపిస్తుంది. కానీ ఈ వాహనాల సంత ఇందుకు అతీతంగా ఉంటుంది. కామారెడ్డికి చెందిన బాబా, నర్సాగౌడ్​లు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి కొంతకాలం పని చేసి తిరిగి వచ్చారు. అక్కడ ప్రతి శుక్రవారం వాహనాల సంత నిర్వహించడం చూసిన ఈ మిత్రద్వయం.. తిరిగి వచ్చాక అదే తరహాలో కామారెడ్డిలో సంత ఏర్పాటు చేశారు.

5తో మొదలై... 100కు చేరింది

ఈ సంతలో.. అమ్మేవారు తమ వాహనాలు తీసుకొచ్చి... కొనేందుకు వచ్చిన వారికి వాహనం, పత్రాలు చూపించి ధర మాట్లాడుకుని విక్రయిస్తుంటారు. కొనుగోలుదారుడు, అమ్మకందారుని మధ్య వారధిలా ఉంటూ.. ఇందుకోసం కొంత రుసుము వసూలు చేస్తున్నారు బాబా, నర్సాగౌడ్​లు. తొలుత ఐదు వాహనాలతో ప్రారంభమైన ఈ సంత ప్రస్తుతం ప్రతి వారం 50 నుంచి 100 వరకు వాహనాల క్రయవిక్రయాలు జరిగే స్థాయికి చేరింది. ప్రారంభంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లో ఆటోల ద్వారా టాం..టాం.. వేయించారు.

రిజిస్ట్రేషన్​ కూడా ఇక్కడే

ఈ సంతకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా సిరిసిల్ల, మెదక్ జిల్లాల ప్రజలు వస్తారు. కొనుగోలు జరిగితే.. రెండు వైపుల నుంచి చెరో రూ..500 రుసుముగా చెల్లిస్తారు. తప్పుడు పత్రాలున్న వాహనాలు, పరికరాలు మార్చిన బైక్​లను ఈ సంతలో అమ్మకుండా జాగ్రత్త వహిస్తారు. దీనికి పోలీసుల సహకారం సైతం తీసుకుంటున్నారు. ద్విచక్రవాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ మార్పిడికి సైతం ఇద్దరు ఆర్టీఏ అధికారులను సంత వద్దే అందుబాటులో ఉంచుతున్నారు. యాజమాన్య మార్పు జరిగిన పత్రాలను సంతలోనే ఇచ్చేస్తున్నారు.

థాంక్యూ​ బాబా, నర్సాగౌడ్

ఖరీదైన కొత్త వాహనాలు కొనలేని తమకు అందుబాటు ధరలో... నచ్చిన వాహనాలు కొనుక్కునే వెసులుబాటు ఈ సంతతో లభించిందని కొనుగోలుదారులు చెబుతున్నారు. భిన్నంగా ఆలోచించి.. సెకండ్ హ్యాండ్ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో మోసాలు నివారించి.. బైక్​లను తమకు అందుబాటులో ఉంచుతోన్న బాబా, నర్సాగౌడ్​లను స్థానికులు అభినందిస్తున్నారు.

Last Updated : Jan 2, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details