Attack on Kamareddy Government Hospital security guard: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న గంగారాజు అనే వ్యక్తిపై పేషెంట్ల బంధువులు స్టీల్ రాడ్లు, కంకర రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
బాధితుడు గంగారాజు తెలిపిన వివరాలు ప్రకారం..కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గంగారాజు అనే వ్యక్తి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాలింత మహిళల కోసం కేటాయించిన వార్డులో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని గమనించాడు. విధి నిర్వహణలో భాగంగా.. ఇది బాలింతల కొరకు కేటాయించిన రూమ్ అని.. ఇందులో వేరే వ్యక్తులు ఉండొద్దని వారికి సూచించాడు. దీంతో కోపోద్రిక్తులైన సదరు రంజిత్, రాజు.. గంగరాజును హాస్పిటల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చారు.
అడ్డువచ్చిన వారిని సైతం..: అక్కడితో ఆగకుండా స్టీల్ రాడ్లు, కంకర రాళ్లతో తలపై దాడి చేశారు. దీంతో గంగారాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి దాడిని అడ్డుకోబోయిన ఓ మహిళ నర్సుపై ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడారు. అదే సమయంలో గంగరాజు తమ్ముడు భరత్.. తన అన్నకు టిఫిన్ ఇవ్వడానికి హాస్పిటల్ వద్దకు చేరుకున్నాడు. దాడిని గమనించిన భరత్ అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. ఆయనపై కూడా దాడి చేశారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడ్డ గంగరాజు, భరత్.. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గాయపరిచిన ఇద్దరు వ్యక్తులపై బాధితులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు.