ఎవరో ఇద్దరు యవకులు.. పీకలదాకా తాగారు. ఏ విషయంలోనో ఇద్దరి మధ్య అభిప్రాయభేదం వచ్చింది. అంతే... మత్తులో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో..? మర్చిపోయి రెచ్చిపోయారు. జనసంచారం ఉన్న రోడ్డులో అందరు చూస్తుండగానే... చేతికి ఏది దొరికితే దాంతో కొట్టుకున్నారు. రక్తాలు కారేలా దాడి చేసుకుని... స్థానికులను కాసేపు భయబ్రాంతులకు గురి చేశారు.
ఈ ఘటన కామారెడ్డిలోని ప్రియ డిలక్స్ రోడ్డులో జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాళ్ళతో ఒకరికి ఒకరు దాడి చేసుకున్నారు. మందుబాబులు చేసిన వీరంగంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకులను నిలువరించారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకులంతా మద్యం మత్తులో ఉండడం వల్ల ఎలాంటి వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.