జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు చెందిన ఓ వ్యక్తి(68) శుక్రవారం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు చేయించుకొన్నాడు. నమూనాలు ఇచ్చిన తర్వాత.. తనకు కరోనా సోకుతుందేమోనని భయంగా ఉందంటూ కుటుంబసభ్యుల ముందు వాపోయాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. అంతకుముందే కరోనా పరీక్షలు చేయించుకోవడంతో అంత్యక్రియలు చేయడం కోసం.. ఆయనకు పాజిటివ్ ఉందా, నెగిటివ్ వచ్చిందా అన్న అనుమానంతో కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు.
అంత్యక్రియలు అయిన పది నిమిషాలకు ఫలితం
ఫలితం రానిదే తామేం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. పదుల సంఖ్యలో జనం వచ్చారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకోగానే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. చివరకు శ్మశానవాటిక వద్ద 15 మందితో దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తయిన పది నిమిషాలకు కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది.