కామారెడ్డి జిల్లాలో గతేడాది ఆశించిన స్థాయిలో మొక్కజొన్న దిగుబడి రాకపోవడంతో ధర రెట్టింపయింది. పంటకు డిమాండ్ పెరగడంతో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల హెక్టారులో సాగు చేయగా ఈసారి ఇప్పటి వరకే 25 వేల హెక్టార్ల వరకు విత్తారు. ముఖ్యంగా తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి, దోమకొండ, భిక్కనూరు, లింగంపేట, బిచ్కుంద మండలాల్లో అధికంగా సాగు చేస్తున్నారు.
మొలక వస్తుండగానే..
లింగంపేట మండలం మోతెలో సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పది రోజుల క్రితం విత్తిన విత్తనాలు ప్రస్తుతం మొలకెత్తుతున్నాయి. అయితే అప్పుడే మొక్కలకు కత్తెర పురుగు సోకింది. పర్మల్ల గ్రామంలో పురుగు విజృంభిస్తోంది.
ఎకరాకు రూ.పది వేల ఖర్చు
మొక్కజొన్న సాగు చేసేందుకు ఎకారానికి రూ.పది వేల వరకు ఖర్చు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. రెండు బస్తాల విత్తనాలు, డీఏపీ, నాగలి కూలి, ట్రాక్టర్ కిరాయి, నాట్ల కూలి.. ఇలా మొత్తం పెట్టిన పెట్టుబడి ఖర్చులు మీద పడ్డాయని వాపోతున్నారు.