Traffic Problems At Railway Gate in Kamareddy :కామారెడ్డి పట్టణంలో రైల్వే క్రాసింగ్ గేట్లు.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మహారాష్ట్ర హైదరాబాద్ రైల్వే మార్గంలో.. రైళ్ల రాకపోకలతో వంతెన లేకపోవడంతో గేట్ పడిన ప్రతిసారి పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం కామారెడ్డి పట్టణం ప్రత్యేక జిల్లాగా అవతరించింది. దీంతో క్రమక్రమంగా పట్టణ విస్తృతి పెరిగి.. మరింత రద్దీగా మారింది.
Railway Crossings Traffic Issues in Kamareddy :వాహనాల సంఖ్య అదే స్థాయిలో పెరిగింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో.. పాతరాజంపేట్ వద్ద ఒక రైల్వే గేట్, కలెక్టరేట్ వైపు వెళ్లే రోడ్డులో అశోక్‌నగర్ వద్ద మరో రైల్వేగేట్ ఉంది. కామారెడ్డి పట్టణం మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్ మధ్య నిత్యం పదుల సంఖ్యలో ప్రజారవాణాతోపాటు సరుకును తీసుకెళ్లే రైళ్లు వెళ్తుంటాయి. రైల్ వెళ్లిన ప్రతిసారి దాదాపు అరగంటకి పైగా గేట్ పడటంతో అటుగా వెళ్లాల్సిన ప్రజల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
Kamareddy Latest News :కామారెడ్డి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి.. అశోక్‌నగర్ రైల్వే గేట్మీదుగానే వెళ్లాలి. కార్యాలయాల ఉద్యోగులతోపాటు నిత్యం వివిధ పనుల నిమిత్తం వందలాది ప్రజలు వెళ్తుంటారు. అంతేకాకుండా ఆ రైల్వే గేట్ ద్వారానే పాత బస్టాండ్‌కి దారితోపాటు.. అడ్లూర్, మోషంపూర్, రంగంపేట తదితర గ్రామాలకు ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు.
ఆ గేట్ ద్వారా రోజూ 30 నుంచి 40 రైళ్లు వెళ్తుండటంతో.. గేట్ పడిన ప్రతిసారీ సుమారు అరగంట సేపు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కి వెళ్లే రోడ్డులో పాతరాజంపేట వద్ద ఉన్న రైల్వేగేట్‌తోనూ ఇబ్బందులు తప్పట్లేదు. పట్టణంనుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కచ్చితంగా ఆ గేట్ దాటాల్సిందే. గంటల పాటు గేట్ల వద్ద ఎదురుచూడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.